కరోనావైరస్ (COVID-19) మహమ్మారి మనల్ని భయపెడుతున్న ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఏమి చేయాలి?

కరోనావైరస్ (COVID-19) మహమ్మారి మనల్ని భయపెడుతున్న ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఏమి చేయాలి?

ఇటీవల విషాదకరమైన కరోనావైరస్ భూమి అంతటా వ్యాప్తి చెందడంతో, మనమందరం ఏదో ఒకవిధముగా ప్రభావితమయ్యాము. దీనికి చాలామంది యొక్క ప్రతిస్పందనేమిటంటే, ఆందోళన మరియు భయము. కానీ ప్రతిస్పందించుటకు మరొక మార్గం కలదు–అది దేవుణ్ణి వెదకడమైయుంది!

తెగులు గల సమయం "తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి ఆయనను వెదకుటకు" ఒక ప్రత్యేక అవకాశాన్ని ప్రజలకు అందిస్తుందని దేవుడు చెప్పెను (2 దిన. 7:14)  "సమాధానకర్తయగు దేవుడు" (1 థెస్స. 5:23)  కేవలము పరలోకములో ఉండుటకు ఇష్టపడక, ఆయన మనచే కనుగొనబడాలని మరియు మనకు సమాధానముగా ఉండవలెనని కోరుచున్నాడు. "మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి" అని యేసు మనతో చెప్పెను (యోహాను 14: 1). మనము కలవరపడవలసిన అవసరము లేదు. చింతించే మరియు భయపడే జీవితమును మనము జీవించనవసరం లేదు. మరొక మార్గము కలదు. "ప్రభువు సమీపముగా ఉన్నాడు" (ఫిలి. 4: 5).

అయితే దేవుడు పరలోకములోనే ఉంటే, ఆయన మనకు దగ్గరగా ఎలా ఉంటాడు? మనకు జీవముగా మరియు సమాధానముగా ఉండుటకు దేవుడు అనేక దశలగుండా ప్రయాణించెనని బైబిలు చెబుచున్నది. ఆయన మనతో జీవించులాగున మరియు మన మానవ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించులాగున 2000 సంవత్సరాల క్రితము ఆయన పరలోకము నుండి దిగివచ్చి శరీరధారణతో యేసు అను మానవుడాయెను. యేసు ఈ భూమిపై మానవ జీవనము ఎలా ఉండాలో చూపించే ఒక నమూనాను–అనగా మనల్ని బాధించే పాపం యొక్క విషము చేత చెరుపబడని, మరియు  ఆ విషము  యొక్క ప్రధాన ఫలితమైన మరణము యొక్క ప్రభావముచే ఎంతమాత్రము బాధింపబడని పరిపూర్ణమైన మానవ జీవనమును జీవించెను (యోహాను 1: 1, 14). అంత సానుకూలమైన రీతిలో మానవ చరిత్రను యేసు ప్రభావితం చేసినంతగా మరే ఇతర మానవుడు ప్రభావితం చేయలేదు. యేసు ఎక్కడికి వెళ్ళినను, ఆయనను వెదకువారికి సమాధానమునిచ్చెను.

ఆ తరువాత, పాపము మరియు మరణము అను సమస్యను పరిష్కరించుటకు, మనకు ప్రత్యామ్నాయంగా మన స్థానములో మరణించుటకు యేసు సిలువ నొద్దకు వెళ్లెను (యెష. 53: 4-6). సిలువపై, ఆయన  పాపం అనే విషమునకు దైవికమైన విరుగుడుమందును ఉత్పత్తి చేయగలిగెను–అదేమనగా మరణమును మరియు పాపమును మ్రింగివేయగల ఆయన నిత్యజీవమును మనలోనికి దయచేయునట్లు దానిని సిలువపై విడుదల చేసెను. మన పాపములు  క్షమించబడి, తద్వారా మనము పరిశుద్ధుడైన, నీతిమంతుడైన దేవునితో సమాధానము కలిగియుండులాగునను (ఎఫె.2: 13-14), మనము ఆయనయందు విశ్వాసముంచుట వలన నశింపక నిత్యజీవము పొందులాగునను ఆయన మన కొరకు చనిపోయెను (యోహాను 3:16). ఆయన మరణ, పునరుత్థానము (సమాధిలోనుండి తిరిగి లేచుట) ద్వారా, మనం దేవునితోను మరియు ఇతరులతోను సమాధానమును కలిగియుండవచ్చును.  ఆయన పునరుత్థానమైన సాయంత్రము, ఆయన తన శిష్యులకు కనబడి, "మీకు సమాధానము కలుగును గాక" అని చెప్పెను మరియు "పరిశుద్ధాత్మను పొందుకొనుడి" అని చెబుతూ వారిలోనికి ఊదుకొనెను (యోహాను 20:21-22).  

ఇప్పుడు, అనగా నేడు, "వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది...అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు"(రోమా. 10: 8-9).  యేసును మీ సమాధానముగా స్వీకరించుటకు మరియు ఈ లోకములో ఉన్న పాపము, చీకటి, మరియు మరణము నుండి రక్షింపబడుటకు ఒక సులువైన మార్గము ఈ విధముగా ప్రార్థించుటే:

ప్రభువైన యేసూ, నేను నీయందు నమ్మికయుంచుచున్నాను! ప్రభువైన యేసూ, పాపము మరియు మరణం నుండి నన్ను రక్షించుము! ప్రభువైన యేసూ, నేను నిన్ను నా జీవముగాను నా సమాధానముగాను స్వీకరించగోరుచున్నాను! ప్రభువైన యేసూ, నాలో జీవించుటకు నాలోనికి వచ్చినందుకు వందనములు!

మీరు యేసును స్వీకరించుటకు ప్రార్థించిన తరువాత, మీరు ఆయనతో క్రమం తప్పకుండా మీ సహవాసమును కొనసాగించవచ్చును. దేవునితో సహవాసము చేయుటనగా ఆయనతో యథార్థముగా సంభాషించుటే. "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి" (ఫిలి. 4: 6). ప్రార్థనలో ఆయన యొద్దకు రండి. మీ సమస్యల విషయమై ఆయనకు తెరచుకొనుడి; ఆయన ఏమైయున్నాడో మరియు మీ కొరకు ఏమి చేశాడో దానినిబట్టి కృతజ్ఞతలు చెల్లించండి. అలా చేసినయెడల మీరు ఆయన రక్షణలోనికి ప్రవేశించగలరు, “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును” (వ. 7).

దేవుని గూర్చియైనను, యేసునందు ఆయన మన కొరకు ఏమి చేసాడు అనేదాని గుర్చియైనను ఇంకా తెలుసుకోవడానికి, మా వెబ్‌సైట్‌ యొద్ద కొన్ని ఉచితమైన పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవడానికి మిమ్మును ఆహ్వానిస్తున్నాము:

https://www.rhemabooks.org/te/free-christian-books/


ఇతరులతో పంచుకొనండి