నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నిచ్చెదను

నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నిచ్చెదను

ప్రభువైన యేసు భూమ్మీద ఉన్నప్పుడు, ఆయన తరచుగా ‘రండి’ అనే ఆహ్వాన మాటను పలికెను. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును’’ (మత్త. 11:28). ‘‘చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి...దేవుని రాజ్యము ఇలాంటి వారిదే’’ (మార్కు 10:14). ‘‘ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను’’ (యోహాను 7:37).  విశ్రాంతి కొరకు మరియు జీవము కొరకు ఆయన యొద్దకు రమ్మని ప్రభువు మనలను ఎల్లప్పుడూ ఆహ్వానించును.

కేవలము ప్రభువు, ఆయన వైపునుండి, రమ్మని మనలను కృపాసహితముగా పిలుచుట మాత్రమే కాదుగాని; మనము మన వైపునుండియు, మన ప్రయాసవలనైన అధికమైన భారము అనే కారణముచే ఆయనయొద్దకు రావల్సిన తీవ్రమైన అవసరతను కలిగియున్నాము.  మనది ఒక ప్రధానమైన ఆందోళన యుగమై ఉన్నది—మరి ముఖ్యముగా ప్రకృతి వైపరీత్యాల గూర్చిన ఆందోళన, వ్యాధులు మరియు మహమ్మారి నుండి వచ్చే ఆందోళన మరియు దాని ఫలితంగా ఏర్పడే గందరగోళం, ఉగ్రవాద ముప్పును గూర్చిన ఆందోళన, అనిశ్చితగల ఆర్థిక వ్యవస్థ వలనైన ఆందోళనతో కూడిన యుగమై ఉన్నది. మన ఉద్యోగంలో మనము కొనసాగుతామా లేదా అని భయపడిపోతున్నాము. మనకు తగినంత ఆహారం మరియు మందులు ఉండునా లేదా అని భయపడిపోతున్నాము. మన పిల్లలు ఎలాంటి ప్రపంచమును స్వతంత్రించుకోబోచున్నారు అని మనము భయపడిపోతున్నాము. ఓ, మనము (ఆయన యొద్దకు) వచ్చి, మన భారములు మరియు ఆందోళనల నుండి ఉపశమనమును ఎంతగా పొందవలెనో గదా!

పాపము అనే సమస్య వలన కూడా మనము త్వరపడి రావలసిన తీవ్రత కలదు. ఈ విశ్వములో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడని, మరియు మనము ఒక సరైన విధముగా మరియు నీతిమంతముగా జీవించాలని మన మనసాక్షిలో మనకు తెలుసు. కానీ మనకొక సమస్య ఉన్నది—మనము దానిని చేయలేము.  మనమందరమును లెక్కలేనన్నిసార్లు దేవునికి వ్యతిరేకముగా మరియు మనుష్యులకు వ్యతిరేకముగా పాపము చేసితిమి. కాబట్టి మనం ఎలా రాగలము? మనము వచ్చుటకు యేసు ఏమి కోరుచున్నాడు?

ఒక్క మాటలో చెప్పాలంటే—ఏమీ లేదు! మనము వచ్చుటకు ఆయన ఇప్పటికే సంపూర్ణమైన సదుపాయమును కల్పించెను గనుక, యేసు ఖచ్చితముగా ఏమియు కోరుటలేదు. ‘‘మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను’’ అని బైబిలు చెబుచున్నది (యెష. 53: 6). మన పాపముల నిమిత్తము ఆయన పూర్తి శిక్షను భరించెను, కాబట్టి మనము ఏమి చేయవలసిన అవసరము లేదు. యేసు తన రక్తాన్ని చిందించెను మరియు మన కొరకు వీటన్నిటిని భరించెను, కాబట్టి మనం ఇకపై మన పాపాలకు శిక్షను భరించము! ఆయన ఋణమును చెల్లించెను, కావున మనము వచ్చినప్పుడు, మన పాపములు క్షమించబడినవన్న నిశ్చయతను మనము కలిగియుండవచ్చును. ఆయన మరణించిన తరువాత,  ఆయన మనలోకి వచ్చి మన ఆంతరిక  సమాధానము మరియు  విశ్రాంతిగా మారుటకు ఆయన పునరుత్థానము చెంది జీవమునిచ్చు ఆత్మగా మారెను (1 కొరి. 15:45) .

ప్రభువైన యేసు మంచి పనులను అడుగడు; ఆయన మంచి నడవడికను అడుగడు; ఆయన నీ యోగ్యతకు సంబంధించిన రుజువును అడుగడు—ఆయన కేవలము ‘‘రండి’’ అని అనును. మరియు ఎవరైతే వచ్చునో, వారికి ఆయన షరతులు లేని వాగ్ధానమును ఇచ్చును: ‘‘నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును’’ (యోహాను 6:37). ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆయన వద్దకు రావడమే. వచ్చుట అనగా అర్థమేమిటి? వచ్చుట అనగా ప్రభువుకు దగ్గరగా సమీపించుట. వచ్చుట అనగా ఆయనను పిలుచుట. వచ్చుట అనగా ఆయనలోనికి విశ్వసించుట మరియు ఆయనను పొందుకొనుట.

ఈ క్షణములో నీవు ఎలా ఉన్నావో అలాగే రావాలని ప్రభువు ఎదురుచూస్తున్నాడు. నీ ప్రస్తుత పాపములతో రమ్ము. నీ ప్రస్తుత భయములతో రమ్ము. నీవు ఎలా ఉంటే అలాగే రమ్ము. నిన్ను నీవు మెరుగుపరచుకొనుటకు వేచియుండ వద్దు—ఆ దినము ఎన్నటికీ రాదు. మన కొరకైన యేసు యొక్క మరణము మన కొరతలన్నిటినీ తీర్చివేసెను. వేచి ఉండాల్సిన అవసరం లేదు—కేవలము రమ్ము. నీవు వచ్చినట్లయితే, నీవు యేసునందు విశ్వాసముంచినట్లయితే, నీవు నీ హృదయమును తెరచి ఆయనకు మొర్రపెట్టినట్లయితే, ఆయన నిన్ను స్వీకరించును. ఆయన వాగ్ధానము ఎప్పటికీ నమ్మదగినది—‘‘నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయును.’’ కేవలము రమ్ము.

‘‘ప్రభువైన యేసూ, నేను పాపిని అని ఒప్పుకొనుచున్నాను. నాకు భయములు మరియు సందేహములు ఉన్నాయని ఒప్పుకొనుచున్నాను, కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వస్తున్నాను. నీ ప్రశస్తమైన రక్తముచే నా పాపములను కడుగమని నిన్ను అడుగుచున్నాను, మరియు నీవు నన్ను ఎంతమాత్రము త్రోసివేయవు అనే నీ వాగ్ధానమును నేను నమ్ముచున్నాను. కావున నేను ఎలా ఉన్నానో అలాగే, నీ యొద్దకు వస్తున్నాను, నీవు నన్ను స్వీకరిస్తావని నీ వాక్యము ద్వారా నాకు తెలియును. నాలోనికి రమ్మని నిన్ను అడుగుచున్నాను. ప్రభువైన యేసూ, నీవే నాకు విశ్రాంతిగా ఉండులాగున నీ యొద్దకు వస్తున్నాను.’’


ఇతరులతో పంచుకొనండి